హైదరాబాద్: మారుతీ సుజుకీ కంపెనీ చరిత్రలో ఇదే మొదటసారి. ఆ కంపెనీ ఏప్రిల్ నెలలో ఒక్క కారును కూడా అమ్మలేదు. దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఆ కంపెనీ కార్లు అమ్ముడుపోలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మారుతీ సుజుకీ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాలను మూసివేసింది. ఫ్యాక్టరీలు, షోరూమ్‌లు మూసివేయడంతో పాటు జనం కూడా ఇంటి వద్దే ఉండడం వల్ల కార్లు అమ్ముడుపోనట్లు మారుతీ పేర్కొన్నది. దేశంలో అత్యధిక కార్లు అమ్మే రికార్డుకు మారుతీ పేరిట ఉన్నది. కానీ లాన్‌డౌన్ ప్రభావం ఆ కంపెనీ మీద కూడా పడింది. మార్చి నెలలో కూడా ఆ కంపెనీ కార్ల అమ్మకాలు 47.4 శాతం పడిపోయినట్లు నివేదిక వెల్లడిస్తున్నది. సాధారణ సమయంలో సుజుకీ కంపెనీ ప్రతి నెల సుమారు లక్షా 50 వేల కార్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఏప్రిల్ నెలలో ముంద్రా పోర్టు నుంచి 632 కార్లను ఎగుమతి చేసినట్లు ఆ కంపెనీ చెప్పింది. గత నెల చివర్లో హర్యానాలోని ఓ ప్లాంట్‌ను ఓపెన్ చేసేందుకు మారుతీకి అనుమతి వచ్చింది.